Рет қаралды 453
Pravachanam 0024at Fact290824
ముఖ్యాంశాలు
1. లౌకికమైన ౘదువులతో లౌకికంగా ఎట్లా ఎదుగుతారో, అట్లాగే అధ్యాత్మవిద్యతో ఆధ్యాత్మికంగా, జన్మాంతర సంస్కారంలో ఎదుగుతారు. సరియైన కృషి చేస్తే అసలు జన్మయే లేకుండా పోతుంది.
2. బుద్ధితో మనస్సును/మనోమయకోశమును అర్థం చేసుకోవాలి. మనస్సు తనను తాను గుర్తింౘలేదు. బుద్ధితో తనను గుర్తింౘుకుంటే మనస్సుయొక్క లీలలు అర్థమవుతాయి.
3. శబ్దాదిభిః పఞ్చభిరేవ పఞ్చ, పఞ్చత్వమాపుః స్వగుణైర్నిబద్ధాః
కురంగ-మాతంగ-పతంగ-మీన-భృంగా, నరః పఞ్చభిరంచితః కిం ...... వి.చూ. 78
4. కురంగ=లేడి, మాతంగ=ఏనుగు, పతంగ=మిడుత(దీపపు పురుగు), మీన=చేప, భృంగా=భ్రమరం/తుమ్మెద, పఞ్చ= అను ఇవి ఐదు, పఞ్చభిః=ఐదైన, శబ్దాదిభిః= శబ్దము మొదలగు, స్వగుణైర్నిబద్ధాః= తమతమ ఇష్టానుసారమైన గుణములచే కట్టబడినవై, పఞ్చత్వం=మరణం, ఆపుః=పొందినవి. పఞ్చభిః= ఈ ఐదింటిచేత, అంచితః=కూడుకొన్నవాడైన, నరః కిం?=మనిషి విషయమై ఇక ఏమిచెప్పాలి?
5. లేడి, ఏనుగు, మిడుత (దీపపు పురుగు), చేప, తుమ్మెద - ఈ ఐదు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియార్థమునందు కోరికచేత మోసపోయి ౘచ్చిపోతాయి. కానీ మనిషి ఐదు జ్ఞానేంద్రియవిషయములయందు కోరికచేత మోసపోతాడు. ఇక వాడి ౘావేమని చెప్పాలి!
6. లేడికి సంగీతమంటే ఇష్టం. ఈ శ్రవణేంద్రియ విషయాసక్తి ఆధారంగా వేటగాడు దాన్ని ౘంపుతాడు. మనిషి, కోరిక ఆధారంగా లేని శుద్ధమైన మనస్సుతో సంగీతం వింటే, లేడివలె మోసపోడు.
7. ఏనుగుకు కామమెక్కువ. ఈ స్పర్శేంద్రియ విషయాసక్తి ఆధారంగా వేటగాడు దాన్ని బంధిస్తాడు. అట్లాగే ఎవడికి కామవేగం ఎక్కువగా ఉంటుందో వాడు దానికి పట్టువడి నిౘ్చావుననుభవిస్తాడు.
8. దీపపు పురుగు దీపపువెలుగుయందు ఆకర్షింపబడి వేగంగా వచ్చి ఆ అగ్నిలో దూకి ౘస్తుంది. అట్లాగే మనిషి, రూపంచేత ఆకర్షింపబడి మోసపోయి దానికి పట్టువడి నిౘ్చావుననుభవిస్తాడు.
9. చేపకున్న రసనేంద్రియ విషయాసక్తి ఆధారంగా దానికి ఎఱవేసి పట్టుకుంటాడు వేటగాడు. అట్లాగే మనిషి, రుచియందు ఆకర్షింపబడి మోసపోయి దానికి పట్టువడి నిౘ్చావుననుభవిస్తాడు.
10. తుమ్మెద ఘ్రాణేంద్రియ విషయాసక్తిచేత సంపెంగపువ్వు వాసనౘూచి ౘచ్చిపోతుంది. అట్లాగే మనిషి, విషయవాసనలచేత మోసపోయి నిౘ్చావుననుభవిస్తాడు.
11. మనిషి, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములయందు కోరికను తీర్చుకొని తృప్తిపడడానికే జీవితమంతా కృషిచేస్తున్నాడు.
12. చీకటిగా ఉన్నప్పుడు Torch light వెలుగులో వస్తువులను ౘూడటం సామాన్యంగా చేసేది. కానీ ఆ వెలుగుయొక్క ప్రకాశము/తేజస్సును గుర్తింౘుటయే, దానియందు ఎఱుక కలిగియుండే లక్షణము. అట్లాగే, జ్ఞానేంద్రియముల గ్రహింపుకు ఆధారంగా వెనుక ఉన్న మనస్సుయొక్క తేజస్సును తెలిసికోవాలి. మనస్సుకు/మనోమయకోశమునకు తేజస్సు, ఉనికిచైతన్యమునుండి వస్తుంది. ౘూపురూపంలో, వినికిడిరూపంలో, స్పర్శరూపంలో, రుచిరూపంలో, వాసనరూపంలో ఆ తేజస్సునే తెలిసికోవడం శుద్ధమైన మనస్సు లక్షణం. ఇది గుర్తింౘకుండా కోరికల ప్రేరేపణలచేత బాహ్యమైన శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములను ఆస్వాదింౘడం అశుద్ధమైన మనస్సు లక్షణం. దృష్టి మార్చుకొని కోరికలను నిగ్రహించి, ఉనికిచైతన్యమునందు ఎఱుకతో ఉన్నవాడు మోసపోడు, నిౘ్చావు ౘావడు.
ఓం తత్ సత్