Рет қаралды 2,617
ఆమనగల్లు గుట్టపై ఆయ్య విగ్రహం
------------- చరిత్ర పరిశోధకుడు
రెడ్డి రత్నాకర్ రెడ్డి 9848625060
తమిళనాడులో పూజలందుకుంటున్న " అయ్య " లేదా అయ్యనార్ , గతంలో తెలంగాణలోనూ పూజించబడినట్లు , అయ్యకు ఆలయాలు కూడా ఉన్నాయని తన పరిశోధనలో వెల్లడైందనీ చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ శివారులో రామలింగేశ్వర స్వామి గుట్టపై రాష్ట్రకూటుల కాలంలో పూజించబడిన "అయ్యనర్ " దేవుని విగ్రహమును గుర్తించారు.
తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఆరుదైన ఈ విగ్రహం రాష్ట్రకూట పాలకుల కాలం నాటిదని తెలిపారు.
పశ్చిమ ముఖ ద్వారం ఉన్న రామలింగేశ్వర ఆలయం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ధ్వంసమైన బౌద్ధ ఆయక స్తంభములోని ఒక ముక్క శివలింగంగా పూజించబడుతున్నది. రెండు శిలా శాసనాలు బయట ఉండగా పరిష్కరించబడని మరో రెండు శాసనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపించె బ్రహ్మ విగ్రహం పైభాగాన గోడకు ఒక శాసనం, ఆలయం లోపల స్తంభానికి మరొక శాసనము ఉన్నాయి. ఆలయం యొక్క ఉత్తర , దక్షిణంలో ఉన్న కిటికీలకు ద్వార పాలకులు ఉండడం ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడి నందితో పాటు ఆలయం ముందు మహిషాసుర మర్ధిని విగ్రహం మరొక ప్రత్యేకత. ఈ మహిషాసుర మర్ధిని విగ్రహానికి ఆనించి అయ్య విగ్రహం ఉంది. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఈ "అయ్య "విగ్రహం చేర్చనున్నది.
అయ్య విలాసాసనంలో కూర్చొని ఉన్నాడు. ఎడమ మోకాలిపై ఎడమచేయి చాచి ఉంది. కుడి చేతిలో గొడ్డలి ఉంది. శిరోజాలు ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దబడినాయి. ఎడమ కాలికి నడుము నుండి పట్ట బంధం బిగించబడింది.గతంలో పానమట్టం పై ఉండే రంధ్రంలో నిలబెట్టినట్లుగా తెలిపేలా విగ్రహము కింది భాగం ఉంది. విగ్రహం రెండు వైపులా , చేతులు మరియు తల భాగం ద్వంసమైనది.
గతంలో ఇదే పరిశోధకుడు జనగామ జిల్లా జనగామ మండలంలోని ఎల్లంల గ్రామంలో అయ్యల కాడ అనే ప్రాంతంలో తొలిసారిగా అయ్య విగ్రహంతో పాటు ఆలయాన్ని గుర్తించారు. ఇప్పుడు ఆమనగల్లులో కూడా అయ్య విగ్రహాన్ని గుర్తించడంతో తెలంగాణ అంతట అయ్య ఆరాధన ఉందని పరిశోధకుడు తెలిపారు.
అయ్య రాత్రి వేళలో గ్రామాన్ని రక్షించడానికి ఏనుగు లేదా గుర్రంపై బయలుదేరుతాడు. కుక్కలు తోడు వస్తాయి అనేది ఒక నమ్మకం. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు దండిగా పండిస్తాడని ప్రజల నమ్మకం. అయ్యప్ప పూర్వ రూపమే అయ్యనార్ అని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు.
నవీన శిలాయుగం నుండి అనగా సామాన్య శకం కంటే ముందు ఐదు వేల వేళ్ళ కిందటి నుండే ఆది ఆదిమానవులు జీవించినట్లుగా తెలిపే బద్దులు గుట్టపై (గ్రూవ్స్) ఉన్నాయి. గుట్టపై నాలుగు చోట్ల పిల్లలు జారే జారుడు బండలు ఉన్నాయి. జారగా ఏర్పడిన నునుపు , లోతును బట్టి వెయ్యి ఎండ్ల కిందటి నుండి మనుగడలో ఉన్నాయి.గుట్ట దిగువన సముద్రాన్ని తలపించే చెఱువు ఉంది. చారిత్రిక క్రమాన్ని తెలిపే అనేక శిల్పాలు ఉన్నాయి.పురావస్తు శాఖ అధికారులు సందర్శించి ఈ ఆలయాన్ని, ఇక్కడి విగ్రహాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకుడు కోరారు.