రాజవిద్యా రాజగుహ్య యోగము శ్లో।। 11: అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ । పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ।। (పరమాత్మ, సాకారము) భావము:- సర్వజీవరాసులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన, నాశ్రేష్ఠమైన భావము తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు. వివరము:- పరమాత్మ ఏదో ఒక సమయమున మానవునిగ శరీరము ధరించక తప్పదు. శరీరము ధరించిన అంత గొప్ప పరమాత్మ ఆ సమయములో మానవునివలె సహజముగ మెలగవలసిందె. మానవునికున్న అన్ని కష్టసుఖములు ఆయనకు కూడ తప్పనిసరిగ ఉండును. కర్మలేని పరమాత్మ శరీరము ధరించినపుడు తనకొక కర్మను తానే ఏర్పాటు చేసుకొనివచ్చును. తానే స్వయముగ నిర్మించుకొన్న కర్మ గ్రహముల ఆధీనములో లేదు. గుణములచేత పుట్టిన కర్మ నవగ్రహముల ఆధీనములో ఉండును. పరమాత్మకు ముందు జన్మ కర్మలేదు. కనుక ఆ జన్మలో తానే సృష్ఠించుకొని వచ్చిన కర్మ ఏ జ్యోతిష్యశాస్త్రమునకు అంతుబట్టదు. ఇలా గ్రహములకు సంబంధములేని కర్మను, ఒక జీవితమునకు సరిపడు దానిని తయారు చేసుకొని పుట్టిన పరమాత్మ, భగవంతునిగ శరీరముతో ఉండుట ఎవరు గ్రహించలేరు. కావున ఆయనను కూడ సామాన్య మానవునివలె లెక్కించి, ఆయన గొప్పతనమును ఏమాత్రము గుర్తించలేని మూఢ మానవులు భగవంతుని కూడ అవమానింతురు. భగవంతుడు భూమి మీదకొచ్చినది ధర్మములు తెలియజేయునిమిత్తము. ఆయన ఏమి చేయుచున్నాడని గ్రహించని మనుషులు, ఆయన విశిష్టతను ఏమాత్రము తెలియక ఎన్నో అవమానములకు గురిచేతురు.