Рет қаралды 43,787
వేటూరి పాటల్లో అందాలు
తెలుగు సినీ గీతం ఎందరో కవుల చేతులలో గారాలుపోయింది. మల్లాదివారి అచ్చతెనుగు సరోవరంలో స్నానం చేసి, కృష్ణశాస్త్రి గారిచ్చిన హాయి పరికిణీ కట్టింది. సముద్రాలవారింట పూజ చేసుకుని, కొసరాజుగారితో పల్లెబాట పట్టింది. పింగళిగారు కనబడగానే కొత్తపోకళ్లు పోయిన ఆ గీతం, శ్రీశ్రీ గారి దగ్గరకెళ్లగానే వేడెక్కిపోయింది. ఆరుద్ర గారి సావాసంతో కొంత కొంటెతనం అబ్బినా, దాశరథిగారి దగ్గర లలిత శృంగార పాఠాలు నేర్చుకుంది. నారాయణరెడ్డి గారిచ్చిన నగలు పెట్టుకుని సొగసుగత్తెగా మారిన ఆ గీతం, ఆత్రేయగారి ప్రేమలో పడి పరవశించింది, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు కన్నీరుమున్నీరుగా విలపించి కరిగినీరైపోయింది. ఇంతమంది ఇంతలా ముద్దు చేసిన ఆ గీతం, ఒక కవిపుంగవుడి దృష్టి పడగానే మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. ఉత్సాహంతో పరవళ్ళు త్రొక్కింది. సరిహద్దుల్ని చెరిపేసుకుంది. ప్రకృతిని పెనవేసుకుంది. పసిపాపల్ని లాలించింది, ప్రణయజీవుల్ని కవ్వించింది, వయసుమళ్లినవారిని సేదదీర్చింది. అంతటా తానై, అన్నిటా తానై, తెలుగు సినీ సాహితికి నాదమై, రసిక హృదయాలకు మోదమై, వేటూరి గీతమై తన విశ్వరూపాన్ని చూపించింది. నవరస సోపానాలపై నిలిచి ఉండే ఆ తెలుగు సినీ కవితా సార్వభౌమ పీఠంపై, తనకీ స్థాయిని కల్పించిన చిత్రకవితాశిల్పి శ్రీ వేటూరి సుందర రామమూర్తిగారిని అధిష్టింపజేసి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించింది. ఆయన గీతత్వానికి గురుత్వాన్ని ఆపాదించి చిరంజీవత్వాన్ని కల్పించింది. అలా తెలుగు సినీ గీతానికి కొత్త జిలుగులద్దిన తెలుగువెలుగు మన వేటూరిగారు. వారి జయంతి ఈరోజు. ఎప్పుటికీ చెప్పుకోదగ్గవారికోసం ఎంత చెప్పుకున్నా తక్కువే కనుక, ఎప్పుడు చెప్పుకున్నా మక్కువే కనుక, సరిగ్గా 85 సంవత్సరాల క్రితం వేణువై ఈ భువనానికి వచ్చిన వేటూరి గారి గురించి ఈరోజు కూడా కాసిన్ని మాటలు చెప్పుకుందాం.
Rajan PTSK
#RajanPTSK #Veturi #TeluguSongs